పేజీలు

13.12.23

మత్తయి 11:11-15

 మత్తయి  11:11-15

"మానవులందరిలో స్నాపకుడగు  యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున అత్యల్పుపుడు అతనికంటే గొప్పవాడు. స్నాపకుడగు యోహాను కాలమునుండి నేటివరకును పరలోక రాజ్యము హింసకు గురియగుచున్నది. మరియు దుష్టులు దౌర్జన్యముతో కబలింప యత్నించుచున్నారు. యోహాను కాలమువరకు ప్రవక్తలందరు దీనినే ప్రవచించిరి. ధర్మ శాస్త్రము దీనినే బోధించెను. వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో, రాబోవు ఏలియా ఇతడే. వినులున్నవాడు వినునుగాక!

ధ్యానం :"మానవులందరిలో స్నాపకుడగు  యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." యేసు ప్రభువు బాప్తిస్త యోహాను గురించి మాటలాడుతున్నారు. కాని ఆయనను అప్పటికే అక్కడ లేరు, ఆయనను హెరోదు బంధించి చెరసాలలో ఉంచారు. ఆయన చేసిన నేరం ఏమి లేదు, కేవలం హెరోదు తన సోదరుని భార్యను పెళ్లి చేసుకోవడాన్ని ప్రశ్నించడమే, ఆయనను బంధించబడేలా చేసింది. మానవుని గొప్పతనాన్ని దేవుడు గణించినప్పుడు యోహాను కంటే గొప్ప వారు ఎవరు లేరు,  ఆయన ప్రభువుని ముందుగా వచ్చి ప్రభువును ప్రజలకు చూపించాడు. ప్రవక్తలు, పితరులు నాయకులు, న్యాయాదిపతులు వీరి అందరి కంటే యోహాను గొప్పవాడు. మానవులందిరిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు. ఆయన ప్రభువును ఈ లోకానికి ఆహ్వానించడానికి, ఎంతో కఠినమైన నిష్టతో జీవించాడు. అతను తాను హింసించబడతాడని, తెలిసికూడా న్యాయానికి కట్టుబడ్డాడు. అబ్రహాము కూడా ప్రాణానికి భయపడి భార్యను సోదరి అని చెప్పాడు. యోహాను యొక్క జీవితం ఎంత గొప్పది అంటే మెస్సీయ్యా ఎవరో ఆయనికి మాత్రమే తెలుసు. ఆయన ఎక్కడ ఉన్నాకాని గుర్తు పట్టగలరు. ఆయన పవిత్రత అందుకు దోహద పడింది. ప్రభువే పవిత్రత కాబట్టి, యోహాను పవిత్రత ప్రభువును కనుకొనడానికి దోహదపడింది.  ఆయనలో ఉన్న వినయం ఎంత గొప్పది అంటే తన కంటే చిన్నవాడు, తన చుట్టమైన యేసు ప్రభువును ఈ లోకానికి రానున్న మెస్సీయ్యాగా ప్రకటించడానికి సందేహించలేదు. తన పవిత్రత గురించి  కాని, తన కఠినమైన నిష్టతో జీవించిన  జీవితం గురించి కాని, గర్వం ఏ కోశన లేని వాడు.

అయినను పరలోక రాజ్యమున అత్యల్పుపుడు అతనికంటే గొప్పవాడు. స్నాపకుడగు యోహాను కాలమునుండి నేటివరకును పరలోక రాజ్యము హింసకు గురియగుచున్నది. మరియు దుష్టులు దౌర్జన్యముతో కబలింప యత్నించుచున్నారు. ఇంత గొప్ప వాడు అయిన యోహాను కూడా పరలోక రాజ్యంలో అత్యల్పుడు. పరలోక రాజ్యం లోని పవిత్రత, ఆ ఆనందం, ఆ అనుగ్రహం ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదు. మలాకి ప్రవక్త 4 వ అధ్యాయం 5 వ వచనంలో "ఆ దినము రాక మునుపే ఏలియా ప్రవక్తను మీ వద్దకు పంపుదును" అని ప్రవచిస్తున్నాడు. అందుకే యిస్రాయేలు ప్రజలు వారి అన్ని ముఖ్యమైన  పండుగలకు, వారితో పాటు ఒక ఆసనాన్ని ఖాళీగా ఏలియా కోసం అంటిపెడుతారు. మలాకి మాటల అర్ధం లూకా సువార్త మొదటి అధ్యాయం 17 వ వచనంలో చూస్తాము. "అతడు ఏలియా ఆత్మయును, శక్తియును గలవాడై ప్రభువునకు ముందుగా నడచును. తల్లి దండ్రులను, బిడ్డలను సమాధానపరచును. ఆవిధేయులనౌ నీతిమంతుల  మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు సన్నద్దులైన  ప్రజలను సమాయత్త పరచును"

స్నాపకుడగు యోహాను కాలమునుండి నేటివరకును పరలోక రాజ్యము హింసకు గురియగుచున్నది. మరియు దుష్టులు దౌర్జన్యముతో కబలింప యత్నించుచున్నారు. పరలోక రాజ్యం హింసకు గురి అవడం యోహాను దాని గురించి భోదస్తున్నప్పటి  నుండి మొదలయింది. కొంత మంది దానిని బలవంతముగా లాక్కోవాలని చూస్తున్నారు. ఈ మాటల అర్ధం యోహాను ఈ దేవుని రాజ్యం గురించి మాటలాడుతున్నందుకు ఆయనను బంధించారు. యోహానుద్వారా  జ్ఞానస్నానం పొంది, ఈ దేవుని రాజ్యంలో చేరాలని యూదాయ, గలీలియ ప్రజలు అందరు, తండోపతండాలుగా ఆయన వద్దకు వచ్చి, జ్ఞానస్నానం పొందాలని ఆయనకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించారు, కాని ఇలా చేయడం వలన వారు పరలోక రాజ్యంలో చేరరు, వారు మారు మనసు పొందాలి. ప్రవక్తలు, ధర్మ శాస్త్రం మొత్తం కూడా ఈ ప్రభువును ఎలా స్వీకరించాలో చెబుతున్నారు. కాని ప్రజలు త్వరగా దానిని అనుభవించాలి అని ఆయనను ఇబ్బంది పెట్టారు. యేసు ప్రభువు ఈ మాటల ద్వారా తాను రాబోయే రక్షకుడునని, ఏలియా యోహాను రూపంలో వీరి మధ్యకు వచ్చి , ప్రభువును వారికి చూపించిన విషయం తేటతెల్లం చేస్తూ, ఆయనను వారి వారి జీవితలలోనికి ఆహ్వానించవలసిన అవసరం ఏమిటో చెప్పినట్లయింది. యోహానే ఏలియా అని గ్రహించిప్రభువునుమనజీవితాలలోనికి ఆహ్వానిద్దాం. https://amruthavellaturi.blogspot.com/2023/03/blog-post_84.html

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు  మానవునిగా పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవారు లేరు అని పలుకుతున్నారు. యోహన అంతటి ఘనతను కేవలం మిమ్ములను కనుకొనుట ద్వారానే మాకు తెలుస్తుంది, మీరు మరియ తల్లి గర్భంలో ఉండగా మీ రాకను చూసి, తన తల్లి గర్భంలో ఉండి ఆనందంతో గంతులు వేశాడు. ఈ యొక్క రాకను అందంతో ఆహ్వానించాడు. ప్రభువా మేము కూడా యోహాను వలె మీరు ఎక్కడ ఉన్న తెలుసుకొనే అనుగ్రహం దయచేయండి. అలానే యోహాను వలె మేము కూడా మిమ్ము నిష్టతో, పవిత్రతతో మా జీవితాలలోనికి ఆహ్వానించే విధంగా చేయండి. ప్రభువా! యోహాను, ఏలియా అని మీరు ప్రకటించుచున్నారు. మెస్సీయా వచ్చే ముందు ఏలియా వస్తారు అని పవిత్ర వాక్యం ప్రకటిస్తుంది, ఆ ఏలియా యోహాను అని మీరు ప్రకటిస్తున్నారు. యోహాను మిమ్ములను మెస్సీయా  అని యోహాను గుర్తించారు. మేము కూడా మీరు రక్షకుడు అని గ్రహించి, యోహాను మిమ్ములను ఇతరులకు చూపిన విధముగా, మేము మిమ్ములను అందరికీ తెలియజేసే అనుగ్రహం చేయండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతికొస్తు మహోత్సవం

పెంతికొస్తు మహోత్సవం  యోహాను 20:19-23  అది ఆదివారము సాయంసమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసికొనియుండిరి. యేసు వచ్చి వారిమధ్య నిలు...