పేజీలు

26.5.23

అనుదిన ఆత్మీయ ఆహారం, యోహాను 21:15-19

యోహాను 21:15-19 

వారు భుజించిన  పిమ్మట యేసు, సీమోను పేతురుతో, "యోహాను పుత్రుడవైన సీమోను! నీవు నన్ను వీరందరి కంటే  ఎక్కువగ ప్రేమించుచున్నావా?" అని అడిగెను. అందుకు పేతురు "అవును ప్రభూ ! నేను నిన్ను ప్రేమించుచున్నానని  నీవు ఎరుగుదువు" అని సమాధానమిచ్చేను. అపుడు యేసు , "నీవు నా గొర్రెపిల్లలను మేపుము" అని చెప్పెను. "యోహాను పుత్రుడవైన సీమోనూ! నీవు నన్ను ప్రేమించుచున్నావా?" అని  యేసు రెండవ పర్యాయము అతనిని అడిగెను. "అవును ప్రభూ! నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు" అని పేతురు బదులు చెప్పెను. "నా గొర్రెలను కాయుము"అని యేసు చెప్పెను. "యోహాను పుత్రుడవైన సీమోనూ! నీవు నన్ను ప్రేమించుచున్నావా?" అని మూడవ పర్యాయము యేసు అతనిని అడిగెను. "నీవు నన్ను ప్రేమించుచున్నావా?" అని యేసు మూడవ పర్యాయము అడిగినందున పేతురు మనస్సునొచ్చుకొని "ప్రభూ నీకు అంతయును తెలియును. నేను నిన్ను ప్రేమించుచున్నానని  నీవు ఎరుగుదువు" అనెను. అపుడు యేసు "నా గొర్రెలను మేపుము" అనెను. ఆయన అతనితో "నేను నిశ్చయముగ చెప్పుచున్నాను. నీవు యువకుడవుగా ఉన్నప్పుడు నడుముకట్టి  నీవు వెళ్లదలచిన చోటుకు వెళ్ళేడివాడవు. కాని, నీవు వృద్దుడవైనప్పుడు నీ చేతులు చాచెదవు. అపుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసుకొనిపోవును" అని చెప్పెను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమ పరపనున్నాడో సూచించుటకు  ఆయన  ఇట్లు పలికి "నన్ను వెంబడించును" అని అతనితో అనెను. 

ధ్యానము 

సన్నివేశం: యేసు ప్రభువు పునరుత్థానం అయిన  తరువాత అనేక సార్లు,  తన శిష్యులకు దర్శనం ఇచ్చారు. వారితో మాట్లాడారు. ఈ సువిశేష భాగం కూడా యేసు ప్రభువు పునరుత్థానం అయిన తరువాత తన శిష్యులకు ఇచ్చిన దర్శనాలలో ఒక  దర్శనం. యేసు ప్రభువుతో  పేతురు  అందరు నిన్ను వీడిన నేను మాత్రమ నిన్ను వీడను అని చెప్పాడు. నీ కోసం నా ప్రాణమును కూడా అర్పిస్తాను అని చెప్పారు. కాని యేసు ప్రభువును శత్రువులు పట్టుకున్నప్పుడు, ఆయనకు సాక్షిగా నిలువకుండ  క్రీస్తు ప్రభువు ఎవరో తెలియదు అని చెప్పి   పారిపోయాడు. పేతురుకి యేసు ప్రభువు పునరుత్థానం అయిన తరువాత  ఏమి చేయాలో తెలియలేదు, ఎందుకంటే ఆయన  ఎవరో తెలియదు అని చెప్పాడు కనుక  యేసు ప్రభువును గురించి బోధించడానికి  పోలేడు, ఆయన శిష్యునిగా చెప్పుకోలేడు.  ఇప్పుడు ఏమి చేయాలి? ఇవన్నీ వదలి తన వృత్తి  అయిన చేపలు పట్టుటకు తన సహోదరులతో కలసి వెళ్ళాడు.  ఆ రోజు వారికి ఏమి దొరకలేదు. అక్కడ తీరంలో ఉన్న వ్యక్తి (యేసు ప్రభువే)  ప్రక్కన వల వేయమని చెప్పాడు. వారికి బాగా చేపలు దొరికాయి. వెంటనే ఆయన ప్రభువే అని యోహాను గుర్తించి వారికి  చెబుతున్నాడు. అది తెలుసుకున్న పేతురు నీటిలోకి దూకి ప్రభువును చేరుతున్నాడు. యేసు ప్రభువు వారిని వచ్చి భుజించమని అడుగుతున్నాడు. దాని తరువాత యేసు ప్రభువు పేతురును నీవు నన్ను వీరందరి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అని అడుగుతున్నాడు.  

"వారు భుజించిన  పిమ్మట యేసు , సీమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సీమోను! నీవు నన్ను వీరందరి కంటే  ఎక్కువగ ప్రేమించుచున్నావా? అని అడిగెను."  ఇక్కడ పేతురును యేసు ప్రభువు సిమోను అని పిలుస్తున్నారు. సిమోను అంటే రేళ్లు కాడ అని అర్ధం. ఈ రేళ్లు కాడ రాయిగా మారలేదు. రాయిగా మారిన తరువాత ఆయన ప్రేమ మనం చూడగలం.    యేసు ప్రభువు పేతురును మూడుసార్లు  నీవు నన్ను వీరందరికి  కంటే ఎక్కువగా  ప్రేమించుచున్నవా అని అడుగుతున్నారు.  పేతురు రెండు సార్లు , అవును ప్రభూ నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను అని చెప్పారు. కాని మూడవ సారి కూడా అడిగినందుకు ఆయన మనస్సు నొచ్చుకొని ,  ప్రభూ నీకు మొత్తం తెలియును అని చెబుతున్నారు. ఇక్కడ మూడు సార్లు యేసు ప్రభువు ఎందుకు అడుగుచున్నారు.  దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అంతకు ముందు పేతురు మూడు సార్లు యేసు ప్రభువు ఎవరో తెలియదు అని అబద్ధం చెప్పాడు. మరలా మూడు సార్లు యేసు ప్రభువును ప్రేమిస్తున్నాను అని చెప్పడం వలన ఆయన ఎవరో  తెలియదు అని చెప్పిన దానిని సరిచేయడం జరుగుతుంది. పేతురు గారు తన పొరపాటు సరిదిద్దుకుంటున్నారు. మూడు సార్లు నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను అని చెప్పడం వలన,  తాను ఆయనతో ఉన్నప్పుడు చెప్పిన మాటలు మరల గుర్తుకు తెచ్చుకొని, తెగిపోయిన శిష్యరికమును పునరుద్దరిస్తున్నారు. 

పేతురుకు ప్రభువు అంటే ప్రేమ ఉన్నది అన్నది నిజమే.  ఇప్పుడు తనకి ప్రభువు మీద ఉన్న  ప్రేమ లోకము కంటే ఎక్కువ కాదు. తన కంటే ఎక్కువ కాదు. ఆ ప్రేమ పెరగాలి, అది లోకము మీద కంటే,  తన మీద కంటే ఎక్కువగా వుండాలి,  అప్పుడు మాత్రమే ఆయన అందరు విడిచి వెళ్ళిపోయిన  ప్రభువుతోనే ఉండగలడు, అంతే కాకుండా తన ప్రాణమును కూడా ఆయన కోసం అర్పించడానికి సిద్ధమవుతాడు. యేసు ప్రభువు అడుగుతున్న ఈ ప్రశ్నలు మరియు తన గొర్రెలను కాయుము అని ఇస్తున్న బాధ్యత అతనిని మారుస్తుంది. నా గొర్రెలను మెపుము అని భాధ్యత ఇవ్వుట వలన ప్రభువు మీద ప్రభువు మీద పేతురుకి  ప్రేమ పెరుగుతుంది మరియు , ఎటువంటి పరిస్తితులు వచ్చిన నిశ్చలంగా ప్రభువుతోనే ఉండే మనస్తత్వం పేతురులో వస్తుంది. రాయిగా మారుతున్నారు. 

 పేతురు ప్రభువు కోసం తాను మరణించడానికి కూడా సిద్ధం అని  అంతకు ముందు చెప్పాడు. యేసు ప్రభువు, ఒక వ్యక్తి తన ప్రాణమును తన స్నేహితుని కోసం అర్పించుట  కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వారు ఎవరు లేరు అని చెబుతారు. పేతురుగారు ఇక్కడ  యేసు ప్రభువుని స్నేహితునిగా ఉండుటకు నాకు ఇష్టం ఉన్నది అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ శిష్యుని నుండి   స్నేహితునిగా మారుతున్నాడు. తరువాత పేతురు తన యొక్క స్నేహితుని కోసం మరణిస్తాడు.  
ఆవిధంగా  ప్రభువు మీద  తన ప్రేమను చూపించాడు. పేతురు అబద్ధం చెప్పారు అని  ప్రభువు  కించ పరచలేదు కాని ఒక గొప్ప శిష్యునిగా , స్నేహితునిగా మారుటకు అవకాశం ఇచ్చాడు. 

యోనా కుమారుడవైన సిమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్నకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి   అంటే,  యేసు ప్రభువు మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను పాటింపుము అని చెబుతారు. అంటే ఆయన ఆజ్ఞలను పాటించుట, ఆయనను ప్రేమించుట రెండు కూడా ఒకటే. మనం ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే, ఆయనను ప్రేమించినట్లే.  ఈ ప్రేమలో అత్యున్నత స్థాయి ఏమిటి?  స్నేహితుని కోసం మరణించడం అత్యున్నత ప్రేమ. ఈ స్థాయి మనం చేరుకోవాలి. అందుకే యేసు ప్రభువు తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ఇచ్చువాని కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వారు ఎవరు లేరు, అని చెప్పారు.  ఆ విధంగా పేతురు ప్రభువు కోసం మరణించడం కూడా మనం చూస్తాము. పేతురును ప్రభువు  "నా గొర్రెలను కాయుము"  అని అంటున్నప్పుడు పేతురు యేసు ప్రభువు యొక్క పని చేయాలి, అంతే కాకుండా యేసు ప్రభువు ప్రతినిదిగా ఉండాలి, " నేను నా గొర్రెలకొరకు నా ప్రాణమును ధారపోయుదును అని ప్రభువు  చెపుతున్నారు.యేసు ప్రభువు చెప్పిన పని చేయడం క్రీస్తుని ప్రేమించే వారి విధి. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు పాటింపుము అని ప్రభువు చెబుతున్నారు. పేతురు ఇవన్నీ తరువాత చేస్తున్నారు. క్రీస్తు ప్రేమికునిగా మారుతున్నాడు. 

ప్రార్ధన : ప్రభువా !  మీతో సాన్నిహిత్యం ఉండి , మిమ్ములను ఎరుగను అని చెప్పిన పేతురుకు మీరు చూపిన ప్రేమకు, కరుణకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. మీ కరుణ ఎల్లలు లేనిది మాకు మీలా ఉండటం సాధ్యం కాదు. కాని ప్రభువా మీలా ఉండుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయండి ప్రభువా. మా జీవితాలలో కూడా ప్రభువా అనేక సార్లు పేతురు వలె మిమ్ము ఎరుగను అని, మీకు సాక్షిగా ఉండుటకు వెనుకడుగు వేశాను అటువంటి సందర్భాలలో నన్ను క్షమించండి. మేము ఎల్లప్పుడు మిమ్ములను ప్రేమిస్తూ, మీ మాటలను పాటిస్తూ మీ స్నేహితులుగా, శిష్యులుగా జీవించే భాగ్యం దయచేయండి.  ఈ లోకం మీద, వస్తువుల మీద మరియు మా మీద మాకున్న ప్రేమను తగ్గించుకొని మీ ఔన్నత్యాన్ని తెలుసుకొని మిమ్ములను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ఆమెన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతికొస్తు మహోత్సవం

పెంతికొస్తు మహోత్సవం  యోహాను 20:19-23  అది ఆదివారము సాయంసమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసికొనియుండిరి. యేసు వచ్చి వారిమధ్య నిలు...