పేజీలు

13.3.23

త్రిత్వయిక సర్వేశ్వరుని మహోత్సవం

 త్రిత్వయిక  సర్వేశ్వరుని మహోత్సవం

 సువిశేషము : యేసు అజ్ఞానుసారము పదునొకండుగురు శిష్యులు గలీలియాలోని  పర్వతమునకు వెళ్లిరి. అపుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కాని కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు  వచ్చి వారితో "ఇహపరములందు నాకు సర్వాధికారమీయబడినది. కనుక మీరు వెళ్ళి, సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మోసగుచు, వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు అజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు.  ఇదిగో లోకాంతము  వరకు  సర్వదా నేను  మీతో నుందును" అని అభయ మొసగెను. 

మానవ జీవితములోని   ప్రతి విషయం మనకు తెలియకుండానే  దేవునితో ముడి పడి ఉంది.  మానవ రక్షణ చరిత్ర చూసినప్పుడు ఇది మనకు  తెలుస్తుంది. ప్రతి మానవుడు తన ఉనికి గురించి ఆలోచించినప్పుడు ఖచ్ఛితముగా దేవుని గురించి ఆలోచిస్తాడు, అతను దేవున్ని నమ్మిన లేక నమ్మకపోయిన దేవుని ఉనికి  గురించి  ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దేవుని యొక్క ఉనికి, స్వభావం, మరియు ఆయనతో మన సంబంధం గురించి ఆలోచించే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. 

మానవుడు ఈ సమాజంలో ఉంటున్నాడు కనుక దేవుని గురించి మానవునికి మొదటగా తెలిసేది ఈ సమాజం నుంచే తెలుస్తుంది. మనకు క్రైస్తవులుగా దేవుని గురించి  దేవుని వాక్కు ద్వారా తెలుస్తుంది. దేవుడు తనను తాను పవిత్ర గ్రంధంలో తెలియపరచడం ద్వారా తెలుస్తుంది. మన సొంత ఆలోచన ద్వారా కూడా దేవుని గురించి మనకు తెలుస్తుంది, కాని అది సంపూర్ణం  కాదు. కాని ఎప్పుడైతే అది దేవుడే తెలియయ పరుస్తాడో అది సంపూర్ణంగా  ఉంటుంది. పవిత్ర గ్రంధం  ఇది మనకు ఇది తెలియజేస్తుంది.  

ఇది కేవలం పవిత్ర గ్రంధం తెలియ పరిచే  విషయం మాత్రమే కాదు, మానవుని యొక్క అనుభవం కూడా. ఏమిటి  ఈ మానవుని అనుభవం దైవం గురించి, మరియు పవిత్ర గ్రంధం తెలియజేసేది అంటే  దేవుడు ఒక్కడే కాని ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. పవిత్ర గ్రంధం ఈ సత్యాన్ని మనకు  తెలియ జేస్తుంది. మరియు మానవ అనుభవం ఇది తెలియ పరుస్తుంది. 

దీనిని మనం ఎలా అర్ధం చేసుకుంటున్నాము అని అంటే మొదటిగా ఇది ఒక అనుభవం. యేసు ప్రభువు తో  శిష్యుల కలసి జీవించారు. వారికి యేసు ప్రభువు ప్రార్ధించడం, దేవునితో మాటలడటం అన్నీ తెలుసు. ఆయన వారికి బోధించాడు. ఆయన ఎలా ప్రజలతో మెలిగింది వారు చూసారు. వారు ఆయనను నమ్మిన వారి జీవితాలలో ఏమి జరిగినదో వారు చూసారు. ఇంకా ముఖ్యముగా  పవిత్రాత్మ వారి మీదకు వచ్చిన తరువాత వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. వారు ఆనందంతో పిత, పుత్ర, పవిత్రాత్మను గురించి మాటలాడటం ప్రారంభించారు. యేసు ప్రభువు వారిని తండ్రి గురించి బోధించారు. పవిత్రాత్మను పంపుతాను అని చెప్పారు.  యేసు ప్రభువు ఎవరితోనో మాటలాడిన విషయం, ఆ వ్యక్తి  తండ్రి అని, మరలా యేసు ప్రభువు వారికి వాగ్దానం చేసిన వ్యక్తి పవిత్రాత్మ అని విషయం వీరు తెలుసుకుంటున్నారు. 

వారు దేవున్ని ఒకే వ్యక్తిగా చూస్తూ, వారికి వచ్చిన అనుభవాన్ని వారి మత సంప్రదాయ ప్రకారం చూసారు. వారు అనుభవించిన ముగ్గురు వ్యక్తుల ప్రేమను వారు విభిన్నంగా ఉండాటాన్ని  గమనించారు. ప్రతి అనుభవాన్ని దైవ అనుభవంగానే వారు చూసారు. వీరికి వచ్చిన ప్రతి అనుభవాన్ని వీరు  పరిశీలించినప్పుడు అది దైవం అని వారు గ్రహించారు. దీనిని అనేక విధాలుగా వారు చెప్పడానికి ప్రయత్నించారు . 

క్రైస్తవ ప్రధాన నమ్మకం దేవుడు ఒక్కడే, కాని పిత పుత్ర పవిత్రాత్మగా ఉన్నారు అని తెలియజేస్తుంది. దేవుని వాక్కులో  ఈ పదాలు మనకు ప్రత్యక్షంగా కనపడకపోవచ్చు కాని అనేక విధాలుగా ఇది మనం పవిత్ర గ్రంధంలో చూస్తాము. 

తండ్రి పుత్ర , పవిత్రాత్మలను తెలియ పరుచుట : యేసు ప్రభువు తనను తాను దేవుని కుమారుడను అని తెలియ పరుచుకున్నారు. ఆయన మాటల ద్వారా, ప్రార్దన ద్వారా, విమోచక క్రియల ద్వారా, మరణ పునరుత్థానం ద్వారా , పవిత్రాత్మ శక్తి ద్వారా. తండ్రి యొక్క శక్తిని తెలియ పరిచాడు. ఈవిధంగా ఆయన త్రీత్వాన్ని తెలియ పరిచాడు. పవిత్రాత్మ కూడా త్రీత్వాన్ని తెలియ పరిచారు. పవిత్రాత్మ ప్రభావం వలన  మరియమాత గర్భం దరించుట వలన యేసు ప్రభువు మానవ రూపం తీసుకోవడంతో కుమారుని గురించి ఆత్మ  తెలుపుతుంది. యేసు ప్రభువు జ్ఞాన స్నానం తీసుకునే సమయంలో పవిత్రాత్మ వస్తుంది. తరువాత అపోస్తులుల యొక్క హృదయాలను నింపినప్పుడు మనం చూస్తున్నాం. మత్తయి 28:19. 

యేసు ప్రభువు తన తండ్రిని తెలియ పరుచుట : దేవుడు ఎవరు అనే ప్రశ్నకు  యేసు ప్రభువు దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియజేస్తున్నారు అంటే దేవుడు ఇలా ఉంటారు అని తెలియ పరుస్తున్నారు. దేవుడు  పరలోక  రాజ్య దేవుడు తండ్రి అని తెలుపుతున్నాడు. దేవుని రాజ్యంలో ఎలా ఉంటుంది తెలియజేస్తున్నారు. అది మానవున్ని పూర్తిగా విమోచించెటువంటి రాజ్యం. ఎటువంటి అసమానతలకు తావు లేనిది అని చెబుతున్నారు. యేసు ప్రభువు ఈ రాజ్యం గురించి ప్రకటిస్తూ దీనిని ఈ లోకంలో స్థాపించాలని చెబుతున్నారు. ఏ విధంగా తండ్రి అయిన దేవుడు మానవున్ని కాపాడుతూ వచ్చాడు పూర్తిగా వివరిస్తున్నారు. పాపిగా ఉన్న మానవునితో దేవుడు ఎలా సఖ్యత పొందుతున్నారో తెలియ పరుస్తున్నారు. అనేక ఉపమానలతో. 

దేవున్ని యేసు ప్రభువు అత్యంత కనికరం కలిగిన తండ్రిగా తెలియ పరుస్తున్నారు. సువిశేషాలు యేసు ప్రభువుకు తండ్రికి మధ్య గల బంధం తెలియ పరుస్తున్నాయి. యేసు ప్రభువు దేవున్ని ఒక కుటుంబ సంబంధమైన బంధానికి తీసుకొస్తున్నారు. దేవున్ని తండ్రి అని బోధిస్తున్నారు. తన ప్రార్ధనలు అన్నీ తండ్రికి విన్నవిస్తున్నారు. మార్కు 1:35, 4:46,  లూకా 3:21, 5:16.  తండ్రిని అత్యంత మంచి తనం కలిగిన వాడుగా యేసు ప్రభువు తెలియ పరుస్తున్నారు. దేవుడు తన ప్రజలు తనను వేతకాలి,  అని అనుకోక తప్పిపోయిన తన బిడ్డల కొరకు పోతుంటారు. ముఖ్యంగా ఆయన నుండి దూరంగా వెళ్ళిన వారి వద్దకు వారిని వెదుకుతూ వెళుతుంటారు. యేసు ప్రభువు ఉపమానలలో అయోగ్యులు, చెడ్డవారినికూడా, పాపులకోసం వెదికే వ్యక్తిగా తండ్రిని యేసు ప్రభువు చూపిస్తున్నారు. లూకా 6:35. ఆయన తనను విధేయించే వారిమీద కూడా కనికరం కలిగిన ఉంటాడు. లూకా 15:30. 

 యేసు ప్రభువు  తాను దైవ కుమారునిగా  తెలియ పరుచుకొనుట : యేసు ప్రభువు తాను దేవుని కుమారునిగా తన మాటలు, బోధనలు, పనుల ద్వారా తాను దేవుని కుమారినిగా తెలియచేసుకున్నారు. యేసు ప్రభువు  ఈలోకంలో దేవుని ప్రతినిధిగా కాక  దేవున్ని ఈ లోకంలో తన ప్రవర్తన ద్వారా, పనుల ద్వారా, బోధనల ద్వారా  చూపించారు అంతే కాదు దేవున్ని స్పర్శించేలా చేశారు. దేవుని గురించి మానవ ఆలోచనలు మారె విధంగా చేశారు. మార్కు 2:28. 

యేసు ప్రభువు తనలో విశ్వాసం వుంచమని చెబుతున్నారు. ఆ విధంగా ఆయన దేవుని కుమారుడు అంటే ఏమిటో తెలియచేసారు. ఆయన విమోచన క్రియల ద్వారా విమోచనం పొందిన వారు దేవుని విమోచన శక్తిని అనుభవించి ఈయన దేవుడు అని గ్రహిస్తున్నారు. మనల్ని స్వస్థ పరిచేది, రక్షించేది, ప్రాణమిచ్చేది,దేవుడే. ఈ పనులు అనుభవించినవారు ఆయన దేవుని కుమారుడు అని తెలుసుకున్నారు. ఎందుకంటే ఆయన దేవుని శక్తితో, పనిచేశాడు. దేవుని శక్తి కోసం ఆయన అడగలేదు. అది ఉన్న వాని వలె ప్రవర్తించాడు. మానవులకు అసాధ్యం అయ్యి దేవునికి మాత్రమే సాధ్యమయ్యే పనులను ఆయన చేసి తాను దేవుడను , దేవుని కుమారుడను అని తెలియజేశారు. మార్కు 10:27. తనలో విశ్వాసం ఉంచమని యేసు ప్రభువు చెప్పిన సందర్బాలు ఏమి అంటే ఆయన తనను తాను తెలియ పరుచుకున్న సందర్భాలలో. 

ముగ్గురు వ్యక్తుల యొక్క ధ్యేయం ఏమిటి అంటే దైవ రాజ్య స్థాపన, మానవ రక్షణ, పిత పుత్ర పవిత్రాత్మ ముగ్గురు కూడా ఒకె ధ్యేయం కలిగి ఉన్నారు. యేసు ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన చివరి బోధనలో కూడా మనం ఇది చూస్తున్నాం. తండ్రికి ఉన్నది అంతయు నాది . అంతయు అంటే తండ్రి యొక్క కర్తవ్యం. ప్రేషీత కార్యం. మానవ రక్షణ కార్యం. మరియు దైవ రాజ్య స్థాపన. కుమారుని  గురించి తండ్రికి మాత్రమే పూర్తిగా తెలుసు అధె విధంగా తండ్రి గురించి కుమారునికి మాత్రమే పూర్తిగా తెలుసు. ఇది వారి ఇద్దరి మధ్య ఉన్న బంధం మనకు తెలియజేస్తుంది. ఇది వారి మద్య ఉన్న పరస్పర  ప్రేమను  , మరియు గౌరవాన్ని తెలియజేస్తుంది. ఈయన నా ప్రియమైన కుమారుడు , ఈయన యందు నేను ఆనందించున్నాను. మత్తయి 3: 17. యేసు ప్రభువు కూడా అదే విధంగా అంటున్నారు " నా తండ్రి, మరియు మీ తండ్రి " అని యోహను 20:17. కేవలం కుమారుడు మాత్రమే తండ్రిని మనకు తెలియ పరచగలడు. తండ్రిని మనం తెలుసుకోగలిగేది కుమారుని ద్వారానే. ఎందుకంటే ఆయనకే పూర్తిగా తండ్రికి తెలుసు.  అంతె కాదు యోహను సువార్త 10:30 లో మనం చూస్తున్నాము. యేసు ప్రభువు నేను తండ్రి ఒకటే అని చెబుతున్నారు. 

యేసు ప్రభువు పవిత్రాత్మను తెలియ పరుచుట : యేసు ప్రభువు మాటల కంటేకూడా  తన పనులలో ప్రభువు పవిత్రాత్మను తెలియ పరిచారు. యేసు ప్రభువు యోహను 14:16 లో మార్కు 3: 28-30 లో  తెలియ పరుస్తారు. అంటే అంతకు ముందు పవిత్రాత్మను   గురించి తెలియ లేదని కాదు. మొదటి నుండి యేసు ప్రభువు పవిత్రాత్మతో ఉన్నారు తాను మానవ రూపాన్ని పవిత్రాత్మ ప్రభావం వలన పొందారు.లూకా 1: 35, మత్తయి 1:20.  అయన జ్ఞాన స్నానం  పొందినప్పుడు పవిత్రాత్మ ఆయన మీదకు వస్తుంది. మార్కు 1:9-11. ఆయన పవిత్రాత్మచేత ఏడారికి తీసుకుపోబడ్డారు. లూకా 4:1-14. ఆయన పవిత్రాత్మ శక్తితో అద్భుతాలు చేస్తున్నారు. మార్కు 3:20-30. మత్తయి 12:28. పవిత్రాత్మ యొక్క సాన్నిధ్యం యేసు ప్రభుని పునరుత్థానం సమయంలో మనం చూస్తున్నాము. శిష్యులు ఈ పవిత్రాత్మ ద్వారా ఎంతో ధైర్యాన్ని పొందుతున్నారు.  త్రీత్వాన్ని యేసు ప్రభువు రక్షణ కార్యాన్ని తెలుసుకోకుండా అర్ధం చేసుకోవడం కష్టం. ఎందుకంటే యేసు ప్రభువు తాను రక్షణ కార్యానికి పూనుకున్నప్పుడు పిత పుత్ర యొక్క తోడ్పాటు, వారి ధ్యేయం తెలియచేస్తున్నారు. అది తన ఒక్కడిదే కాక పిత , పుత్ర మరియు పవిత్రాత్మది అని తెలియ జేస్తున్నాడు. త్రీత్వం లో మానవ రక్షణ రహస్యం ప్రకటించబడింది. 

యేసు ప్రభువు వలె పవిత్రాత్మ కూడా త్రీత్వాని తెలియ పరుస్తుంది. మొదటి నుండి పవిత్రాత్మను దేవునిగా మనం ధర్మ శాస్త్రంలో చూస్తాము. పవిత్రాత్మ ముఖ్యముగా కుమారున్నీ లోకానికి తెలియ జేస్తారు. మనం పవిత్రాత్మ ద్వారా కుమారియి వద్దకువస్తాము. అందుకే పవిత్రాత్మను క్రీస్తుని ఆత్మగా పిలుస్తాము. రోమి 8:9. ప్రభుని ఆత్మ అని పిలుస్తాము. 2 కోరింథీ 3:17. యోహను గారు ఆత్మ తండ్రి నుండి వస్తుంది అని చెబుతున్నారు. యోహను 15:26. మరల కుమారుడు ఆత్మను పంపుతాను అని వాగ్ధానం చేస్తున్నాడు యోహను 16:8. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతికొస్తు మహోత్సవం

పెంతికొస్తు మహోత్సవం  యోహాను 20:19-23  అది ఆదివారము సాయంసమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసికొనియుండిరి. యేసు వచ్చి వారిమధ్య నిలు...