సమూయేలు చరిత్ర
సమూవేలు పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చరిత్రలో సమూవేలు అనేక ముఖ్యమైన విధులను పోషించాడు. సమూవేలు ఒక యాజకునిగా, న్యాయాధిపతిగా, జీవితపు చివరి అంకంలో ఓక జాతికి గొప్ప నాయకునిగా జీవించాడు. ఒక ప్రవక్తగా యిస్రాయేలు మొదటి ఇద్దరు రాజులను అభిషేకించాడు. సమూవేలు యిస్రాయేలు ప్రజలకు మరియు దేవునికి మధ్యవర్తిగా మరియు వారి కోసం దేవుని అనుగ్రహం కోరేవానిగా పవిత్ర గ్రంథం తెలియజేస్తుంది. సమూవేలు జీవిత కాల సమయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే యిస్రాయేలు ప్రజలు దేవునితో వారి సంబంధమును పునరుద్ధరించుకోవడంజరిగింది. ఈ కాలంలో దేవుని పట్ల వారు చూపిన విశ్వాసంతో ఎంతగా వారు లాభపడినది, తరువాత అవిశ్వాసంతో ఏమి కోల్పయింది సుష్పష్టంగా కనపడుతుంది.
సమూవేలు అంటే దేవుడు విన్నాడు అని అర్ధం. సమూవేలు తన జీవితాంతం దేవునికి విశ్వాస పాత్రునిగా, విధేయునిగా జీవించాడు. సమూవేలు చిన్నప్పటి నుండి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఇతని జీవితం మొత్తం. దేవుని మాటను వినడం, ఆయనకు విధేయించడం గురించి తెలియజేస్తుంది. సమూవేలు పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు దేవునికి విధేయునిగా జీవించాడు. దేవుడు సమువేలును తన అనుచరులలో గొప్పవానిగా చూసాడు. కీర్తన 99:6-7 "మోషే అహరోను ఆయన యాజకులు , సమువేలు ఆయనకు ప్రార్ధన చేసినవాడు. వారు ఆయనకు మనవి చేయగా ఆయన వారి వేడికోలును ఆలించెను. మేఘ స్థంభం నుండి ఆయన వారితో మాట్లాడెను ఆయన దయచేసిన శాససనములను, కట్టడలను వారు పాటించిరి." చిన్నప్పటి నుండి దేవుని వాక్కును వినుటను అలవాటు చేసుకున్నవాడు. సమువేలు జీవితం మొత్తం దేవునికే మహిమ ఆరాధన అని తెలియజేస్తుంది.
హన్నా ప్రార్ధన సమువేలు జననం
హన్నా సమూవేలు తల్లి. ఆమెకు పెళ్ళైన అనేక సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. ఆమె భర్త ఎల్కానా. ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉన్నారు వారిపేర్లు హన్నా, పెనిన్నా అను వారు. పెనిన్నాకు పిల్లలుపుట్టారు కాని హన్నాకు మాత్రము లేరు. ఎల్కానా షిలోలోఉన్న మందసము వద్ద బలి అర్పించి, వచ్చిన నైవేధ్య భాగాన్ని పెనిన్నాకు ఆమె సంతానానికి ఇచ్చేవాడు. హన్నాకు మాత్రము ఒక భాగమే ఇచ్చేవాడు. భర్త హన్నాను ప్రేమించినప్పటికీ ఆమె గొడ్రాలు అవుటవలన ఇలా చేసేవాడు.పెనిన్నా కూడా ఆమెను ఎగతాళి చేసేది. యావే మందిరమునకు వెళ్ళినప్పుడల్లా పెనిన్నా ఆమెను దెప్పిపొడిచేది. హన్నా మాత్రము ఎప్పుడు వాటిని ఇతరులకు చెప్పడంకాని, వారికి వ్యతిరేకంగా మాట్లాడటం కాని చేసేదికాదు. తన బాధలను దేవునితో మాత్రమే చెప్పుకునేది. ఒక సారి బలి అర్పించుటకు షిలో వెళ్లారు. అక్కడ దేవుని ఎదుట తన బాధను నిట్టూర్పుతో, ఏడుపుతో దేవునితో మాటలాడుతుంది. వారు షిలోవద్ద బలి అర్పించిన తరువాత హన్నా ఆలయంలో ఏడ్చుచు ప్రార్థిస్తుంది. యాజకుడైన ఏలి ఆమెకు త్రాగుట వలన కైపెక్కినది అనుకోని ఎంతసేపు ఆ మత్తుతో ఉంటావు. ద్రాక్షసారాయమును వదిలించుకోమని చెప్పాడు. అందుకు ఆమె , అయ్యా నేను డ్రా త్రాగలేదు, తీరని వేతతో బాధపడుతున్నాను, ,మిక్కిలి కోపతాపములతో మనసు, హృదయము బ్రద్దలవుతుంటే ప్రభువుతో మాటలాడుచున్నాను అని చెప్పింది. అందుకు ఏలి ఆమెతో దేవుడు నీ మోర ఆలకిస్తాడు, ప్రశాంతంగా వెళ్ళమని చెప్పాడు. దాని తరువాత వారు రామాకు తిరిగి వెళ్లారు.
షిలో నుండి ఇంటికి వచ్చిన తరువాత ఎల్కానా తన భార్య హన్నాను కలువగా ఆమె గర్భము ధరించి కుమారున్ని కన్నది. ఆ బిడ్డకు సమూవేలు అని పేరు పెట్టారు. సమూవేలు అనగా దేవుని అడిగితిని అని అర్ధం. తరువాత ఆ కుటుంబం మరియొకసారి షిలోకు వెళ్లారు కాని హన్నా వారితో వెళ్ళలేదు. ఆమె ఎల్కానా మరియు కుటుంబంతో వెళ్లకుండ, సమూవేలు పాలు మానిన సమూవేలును యావేకు సమర్పిస్తాను అని ఇంటివద్దనే ఉంది. అందుకు ఏల్కానా ఒప్పుకున్నాడు. సమూవేలు పాలు మానిన తరువాత హాన్నా సమూవేలును తీసుకొని షిలో వెళ్లి అక్కడ బలిని అర్పించి, బాలుని ఎలి వద్దకు తీసుకువెళ్లి, తనకు జరిగిన అన్ని విషములు చెప్పి, బాలున్ని దేవునికి అర్పించి, ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువుకె ఊడిగము చేయును అని చెప్పింది. అప్పటి నుండి సమూవేలు ప్రభువు మందిరమునే ఉన్నాడు. హన్నా గొప్ప ప్రార్థన చేసి రామాకు వచ్చింది సమూవేలు మారాము ఎలి పర్యవేక్షణలో యావేకు సేవ చేస్తూ, జీవించాడు.
ఏలి కుమారులు - యావే సమూవేలును ఏర్పరుచుకొనుట
ఏలి కుమారులు ప్రభువును లెక్క చేయక పరమ దుర్మార్గాలు చేశారు. బలి మాంసము వండు సమయములోనే యాజకునికి మాంసము కావాలని తీసుకువెళ్ళేవారు, బలిపశువు క్రొవ్వును పీఠము మీద దహించకముందే యాజకునికి వడ్డించుటకు మాంసం కావాలి, ఉడికినది కాదు అని ముందే తీసుకెళ్లేవారు. వారివల్ల యావేకు సమర్పిచు బలికి అగౌరవం కలిగేది. హన్నా ప్రతి సంవత్సరం బలి అర్పించుటకు వచ్చినప్పుడు చిన్న ఏఫోదును తీసుకు వచ్చేది. సమూవేలు దానిని ధరించి యావేకు పరిచర్య చేసేవాడు తరువాత ఆమెకు ముగ్గురు మగ బిడ్డలు ఇద్దరు ఆడ బిడ్డలు పుట్టారు.
ఏలి ముసలివాడవ్వగా తన కుమారులు ప్రభువు గుడారము దగ్గర పనిచేసే వారితో శయనించారని తెలిసి, దేవుని పట్ల వారు చేసిన పాపము చెప్పి వారిని మందలించాడు. కాని వారు ఏలి మాటను పట్టించుకోలేదు. సమూవేలు మాత్రము దేవుని దయకు , ప్రజల మన్ననలకు పాత్రుడయ్యాడు. దేవుని భక్తుడు ఒకరు ఏలి వద్దకు వచ్చి ఏలి కుమారులు ఇద్దరు ఒక్కరోజే చనిపోతారని చెప్పి, యావే విశ్వసనీయుడైన యాజకునిని ఏర్పరుచు కున్న విషయం చెప్పాడు, ఆ యాజకుడు యావే చిత్తప్రకారం జీవించునని, అతని సంతతి తరతరములు యావే అభిషిక్తుని ఎదుట మన్నన పొందుతారు అని చెప్పాడు. ఏలి తన కుమారులను మార్చుటకు ఏమి చేయలేదు, కాని హన్నా తన కుమారుని దేవుని సన్నిదిలో అప్పగించింది. ఏలి కుమారులు కూడా దైవ సన్నిధిలోనే ఉన్న వారు మారలేదు. ఏలి కూడా తన కుమారులు ఆడువారిని చెడుచుతున్నారు అని తెలిసిన ఏమి చేయలేదు. ఏలి కుటుంబం దేవుని సన్నిధిలో ఉండి ఆయన పేరుకు అవమానం కలిగేలా ప్రవర్తించారు. కానీ అక్కడనే ఉన్న సమూవేలు దేవునికి గౌరవం కలిగేలా జీవించాడు. ఎటువంటి వారితో కలిసిఉన్న కాని పాపము చేయకుండా జీవించడం సమూవేలు ద్వారా తెలుసుకోవచ్చు.
సమూవేలును దేవుడు పిలుచుట
సమూవేలు మందసము దగ్గర నిద్రించుండగా దేవుడు సమూవేలును సమూవేలు, సమూవేలు అని పిలిచాడు. దేవుని వాక్కు వినపడటం ఆ రోజులలో చాల అరుదు. సమూవేలును హన్నా దేవుని సేవకు సమర్పించినప్పటికీ ఆయనను తన సేవకు పిలువలసినది దేవుడు. దేవుడు సమూవేలును పిలిచినప్పుడు తన గురువు ఏలి పిలిచినట్లుగా అనుకున్నాడు. ఏలి సమూవేలుకు దేవుని పిలుపును అర్ధం చేసుకొనుటకు సహాయం చేసాడు. ఏలి సమువేలుకు దేవుని పిలుపుకు ఎలా సమాధానము ఇవ్వాలో తెలియజేసాడు. ఏలి సమూవేలుతో మాట్లాడు ప్రభు నీ సేవకుడు వినుచున్నాడు అని సమాధానం ఇవ్వమని చెప్పాడు. ఏలి కుమారులు ఘోరమైన పాపములు చేశారు. సమూవేలు ద్వారా దేవుడు ఏలికి ఒక హెచ్చరిక పంపించాడు.
దేవుడు సమూవేలుకు దేవుడు ఇచ్చిన సందేశం అందరికి హెచ్చరిక అయ్యింది. అది ఏమిటంటే "యిస్రాయేలు జనుల ఎదుట నేనొక కార్యము చేసెదను దానిని గురించి వినిన వారి రెండు చెవులు గింగురుమనును , ఏలి కుటుంబమునునకు నేను చేసెదననిన కార్యము పూర్తి చేస్తాను ఏలి కుటుంబమును చాల కాలమువరకు శపించితినని తెలియజేయమని, ఎలి కుమారులిద్దరు దేవుణ్ణి నిందించున్నారని ఎరిగియు మందలింపలేదు, బలులు ,కానుకలు ఏలి కుమారుల పాపలకు ప్రాయశ్చిత్తం చేయలేవు" అని ప్రభువు సమూవేలుకు చెప్పాడు. ఎలి సమూవేలుతో ఏమి దాచవద్దు దేవుడు నీకు చెప్పినదంత చెప్పమని చెప్పాడు. సమూవేలు దేవుడు చెప్పిన మాటలు ఏలికి చెప్పిన తరువాత ఆయన చేయదలుచుకున్న కార్యము చేయునుగాక అని ఏలి బదులు పలికాడు.
సమువేలు పెరిగి పెద్దవాడయ్యాడు. అయన చెప్పిన ప్రతి మాట జరిగింది. ఏలి అతని కుమారులు చనిపోయారు. దివ్య మందసంపు పెట్టెను ఫిలిస్తీయులు యుద్ధంలో తీసుకెళ్లారు అని తెలిసి కూర్చున్న చోటనే వెనక్కు వాలి, మెడ విరిగి చనిపోయాడు. మామ, భర్త చనిపోయారు అని తెలిసి బిడ్డను ప్రసవించి ఏలి కోడలు చనిపోయింది.
మందసమును పిలిస్తియులు ఎబెసెనేరు నుండి అష్డోదునకు తెచ్చారు. అక్కడ దాగోను దేవాలయములో ఉంచారు. ఉదయముకాగానే దాగోను యావే మందసము ఎదుట నేలపై బోరగిలపడి ఉంది. వారు దాగోనును లేవనెత్తి మరల అక్కడ నిలబెట్టారు. కాని తరువాత రోజు మరల దాగోను యావే మందసము ఎదుట బోరగిలపడి తల, చేతులు నరకబడి గడప దగ్గర ఉన్నవి. యావే అష్డోదును పరిసరప్రాంత ప్రజలను బొబ్బలతో బాధ పెట్టగ, అందుకు వారు తట్టుకోలేక మందసమును గాతునకు చేర్చారు. గాతు ప్రజలు కూడా ప్రభువు పెట్టు బాధలు తట్టుకోలేక ఎక్రోనునకు పంపారు. అక్కడ అనేక మంది చనిపోయారు . మందసము ఏడు మాసములు పిలిస్తుయులతో ఉండగా వారు తట్టుకోలేకపోయారు. ప్రభువు మందసమును వారు అక్కడ నుండి పంపించి వేయుటకు ఎంతో గౌరవంగా బెత్ షెమెషు పొలిమేరల వద్దకు తీసుకు వచ్చి అక్కడనుండి వెళ్లిపోయారు. బేత్ షేమేషు పౌరులు మందసము వారి కంటపడగానే ఆనందంతో ప్రభువుకు బలి అర్పించారు. తరువాత ఆ ప్రజలు పరమ పవిత్రమైన ఆ ప్రభువు ముందట నిలువలేమని కిర్యత్యారీము పంపారు. అక్కడ ప్రజలు ప్రభుమందసమును అబీనాదాబు ఇంట చేర్చారు. అబీనాదాబు కుమారుడు ఎలీయెజెరును ఆ మందసమును శుద్ధి చేసి, కాపాడుటకు నియమించారు.
అక్కడ మందసము 20 సంవత్సరాలు ఉన్నది. ప్రజలకు యావేపై భక్తి కుదిరింది. అప్పుడు సమూవేలు ప్రజలతో మీరు ప్రభువు వద్దకు రాగోరెదరేని, మీరు కొలుచు అన్యదైవములను వదలివేయండి, అష్టోరోతును కూడా మీ చెంతనుండి పంపివేయండి, అపుడు పిలిస్తియుల నుండి యావే మిమ్ము కాపాడుతాడు అని చెప్పాడు. వారు అప్పుడు బాలుదేవతను, అష్టోరోతును వదలి వేశారు. ప్రభువును మాత్రమే సేవించారు. సమూవేలు ప్రజలను మిస్పా వద్ద సమావేశ పరచి అక్కడ ప్రజల కొరకు విన్నపం చేస్తాను అని చెప్పడం జరిగింది. ప్రజలు మిస్పా వద్ద సమావేశమై నీళ్లు త్రోడి యావే ముందు కుమ్మరించి, ఆరోజు ఉపవాసం ఉండి యావే ఆజ్ఞ మీరి పాపము చేసాము అని ఒప్పుకున్నారు. అక్కడ వారి కొరకు సమూవేలు దేవుని ప్రార్ధించాడు.
యిస్రాయేలు మిస్పా వద్ద సమావేశం అయ్యారు అని ఫిలిస్తీ యులు విని వారి మీదకు దండెత్తి వచ్చారు. అప్పుడు ప్రజలు సమూవేలుకు వారికోసం దేవుణ్ణి వెడమని అడుగగా సమూవేలు ఒక పాలు తాగు గొర్రె పిల్లను అర్పించాడు. సమూవేలు బలి అర్పించుచుండగానే వారు వచ్చారు యిస్రాయేలు ప్రజలు యుద్దానికి సిద్ధంగా లేరు కనుక దేవుడు ఉరుము మెరుపుతో వారిలో ఒక గందరగోళం సృష్టించారు, ఆ దెబ్బతో పిలిస్తియులు చెదరిపోయారు. యిస్రాయేలీయులు వారి వెనుకపడి బెత్ కారు వరకు తరిమివేసారు. సమూవేలు మిస్పా మరియు షెను మధ్య ఒక రాతిని యావే వారికి చేసిన మేలుకు గుర్తుగా నాటారు దానికి ఎబెనెసెరు అని పేరు పెట్టారు. యావే ఇంత వరకు మనకు సహాయం చేసెను అని దాని అర్ధం. సమూవేలు జీవించినంత వరకు ప్రభువు పిలిస్తియులను అణచివేశారు. సమూవేలు ఉన్నంత వరకు వారికి తీర్పు తీర్చుచూనే ఉన్నాడు. ఆయన్న బేతేలు, గిల్గాలు , మిస్ఫా చుట్టి వచ్చి వారికి తీర్పు తీర్చేవాడు. సమూవేలు ప్రాయము దాటిన తరువాత ఆయన కుమారులు యావేలు మరియు అబీయాలు న్యాయాధిపతులు అయ్యారు కాని వారు లంచగొండులయ్యారు కనుక ప్రజలు రామాకు వచ్చి సమూవేలును కలుసుకొని అయ్యా నీవు ముసలి ప్రాయంలో ఉన్నావు నీ కుమారులు నీలాంటి వారు కారు కనుక మాకు అన్య జాతుల వలె ఓక రాజును నియమించండి అని చెప్పారు. పెద్దల వేడుకోలు సమువేలుకు నచ్చలేదు.
అపుడు సమూవేలు ప్రభువుతో మాట్లాడగా, ప్రభువు ఈ ప్రజలను వినుము, వీరు నిన్ను కాదు నన్ను నిరాకరించారు, వీరిని ఐగుప్తునుండి తీసుకొనివచ్చినప్పటి నుండి నాకు చేసినట్లే నీకును అపచారము చేశారు. వీరు వేరే దేవరలను కొలిచారు, నీవు వారి మాట వినుము కానీ గట్టిగా హెచ్చరించమని చెప్పగా సమూవేలు ప్రభువు చెప్పిన మాటలను ప్రజలకు చెబుతూ మీరు కోరుకునే రాజు మీ కుమారులను రథములను తోలుటకు, గుఱ్ఱములను కాపాడుటకు, రథముల ముందు పరుగెత్తుటకు, సైన్యములో కొంతమందికి అధిపతులుగా నియమిస్తాడు, వారితో పొలము దున్నించి కొత కోయుటకు, యుద్ధ సామాగ్రిని తయారు చేసుకొనుటకు వాడుకుంటాడు. మీ కుమార్తెలను అత్తరు పూయుటకు, వంటలు వండుటకు, రొట్టెలు కాల్చుటకు వాడుకుంటారు. మీ పొలములలో సారముగల వాటిని తీసుకుంటారు. మీపొలములను తీసుకొని వారి ఉద్యోగులకు ఇస్తారు, మీ పంటలలో పదియవ వంతు తీసుకొని తమ నౌకరులకు ఇచ్చుకుంటారు. మీ పశువులలో ఇష్టమైన వాటిని తీసుకొని తన పనులు చేయించుకుంటాడు. మీరు అతని బానిసలు అవుతారు, మీరు ఎన్నుకొనిన రాజును తలంచుకొని మీరు పెద్ద ఎత్తున ఏడ్చుదురు అని చెప్పాడు. ఇన్ని విషయాలు చెప్పినప్పటికీ వారు అతని మాట వినక మాకు రాజును నియమించాలని పట్టుపట్టారు. అప్పుడు సమూవేలుతో ప్రభువు వారికి ఇష్టము వచ్చినట్లు చేయుమని చెప్పాడు. అప్పుడు సమూవేలు ప్రజలకు మీమీ పట్టణములను వెళ్ళమని చెప్పాడు. ఒకరోజు ప్రభువు సమూవేలుతో రేపు నిర్ణిత సమయమున బెన్యామీను తెగకు చెందిన ఒకనిని నీ వద్దకు పంపెదను అతనిని యిస్రాయేలుకు నాయకునిగా అభిషేకింపమని చెప్పాడు.
ఈ సమయంలోనే సౌలు తన తండ్రి గాడిదలు తప్పి పోగా, తండ్రి వాటిని వెదకిరమ్మని సౌలును పంపాడు. వారు ఎంతగా వెదకినప్పటికీ అవి కనపడలేదు. అప్పుడు సౌలు తండ్రి గాడిదలను గురించి కాక కుమారుని కొరకు బాధపడునేమో అని తన వెంట వచ్చిన సేవకునికి వెనక్కిపోవుదుము అని చెప్పగా ఆతడు ఇక్కడ ఒక దైవభక్తుడు ఒకడు ఉన్నాడు. ఆయన చెప్పినదంతా జరుగును. అతనిని చూచిన మనకు మార్గము చెప్పవచ్చును అని చెప్పగా సౌలు అతనికి ఇవ్వుటకు మనవద్ద ఏమిలేదు కదా అని చెప్పాడు. అప్పుడు ఆ సేవకుడు తన వద్ద పావుతులము వెండి ఉన్నది దానిని అతనికి ఇచ్చెదము అని చెప్పాడు. వారు కొండమీదఉన్న పట్టణమునకెక్కి నీళ్లు తోడుకొనుటకు దిగివచ్చు బాలికలను దీర్ఘదర్శి ఉన్నడా అని అడిగారు. అందుకు వారు ఉన్నాడు, ఈ దినము ఉన్నత స్థలమున బలి అర్పించబోవుతున్నారు అని చెప్పారు. మీరు ఉన్నత స్థలమునకు వెళ్లకమునుపే దర్శించవచ్చును త్వరగా వెళ్ళమని అని చెప్పారు. సౌలు సేవకునితో కలసి పట్టణములో ప్రవేశింపగానే సమూవేలు అతనికి ఎదురుపడ్డాడు. ఆ ముందు రోజునే ప్రభువు సమూవేలుతో రేపు నిర్ణిత సమయమున బెన్యామీను తెగకు చెందిన ఒకనిని నీ వద్దకు పంపెదను అతనిని యిస్రాయేలుకు నాయకునిగా అభిషేకింపమని చెప్పాడు. సౌలు ఎదురుపడగానే ప్రభువు సమూవేలుతో నా ప్రజలను పాలించునని నేను ముందుగా చెప్పినది ఇతని గురించే అని చెప్పాడు. సౌలు సమువేలుతో అయ్యా! దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడ? అని అడుగగా సౌలు దీర్ఘదర్శిని నేనే, నా కంటే ముందుగా వెళ్లి ఉన్నత స్థలమును చేరుకొనుము, నేను ఈరోజు నీతో భుజింపవలెను, రేపు నిన్ను పంపెదను నీవు వెళ్లునప్పుడు నీలోని సంధియును తీర్చెదను, తప్పిపోయిన మీ గాడిదలు దొరికినవి కనుక వాటి గురించి చింతించకు అని చెప్పాడు. యిస్రాయేలు కోరునది నిన్నును నీ కుటుంబమునుకదా అని చెప్పాడు అప్పుడు సౌలు నేను యిస్రాయేలు తెగలలో అల్పమైన బెన్యామీను తెగవాడను, ఆ తెగనందలి అల్పమైనది అటువంటి నా మీద ఇట్టి పలుకులు పలకనేలా అని అన్నాడు.
సమూవేలు సౌలును అతని దాసుని భోజనశాలకు తీసుకొనివెళ్ళి అతిధుల ముందుటి భాగమున వారిని కూర్చుండబెట్టి వేరుగా వండి ఉంచిన వేట తొడను తీసుకొని వచ్చి సౌలు ముందుట పెట్టి భుజింపమని చెప్పాడు. అక్కడ నుండి నగరమునకు వచ్చి, సౌలుకు పడక సిద్దము చేయగా అక్కడ ఆతడు నిద్రించాడు. వేకువనే సమూవేలు సౌలును నిద్రలేపి నగర చివరకు వచ్చిన తరువాత సౌలు సేవకుని సౌలుతో సాగిపొమ్మని చెప్పించి సౌలును అక్కడే ఆపి , యావే ఆజ్ఞను అతనికి తెలియజేస్తాను అని చెప్పాడు. సమూవేలు తైలపుబుడ్డిని తీసుకొని సౌలు తలపై చమురు కుమ్మరించి అతనిని ముద్దు పట్టుకున్నాడు. యావే నిన్ను తన ప్రజలకు నాయకునిగా చేసాడు నీవు ప్రజలను పాలించి శత్రువుల నుండి వారిని కాపాడవలెను . నిన్ను నాయకునిగా ప్రభువు చేసాడు అనుటకు గుర్తులు ఏమిటంటే నన్ను నీవు విడిపోగానే బెన్యామీను పొలిమేరలలో సెల్సా వద్దగల రాహేలు సమాధివద్ద ఇద్దరు నిన్ను కలుసుకొని మీ గాడిదలు దొరికినవి అని చెప్పెదరు. మీ తండ్రి నీ గురించి చింతించుచున్నాడు అని చెప్పుతురు అని తరువాత తాబోరు సింధూరము చేరగానే బేతేలు పోవు ముగ్గురు నీకు దండము పెట్టి రెండు రొట్టెలు కానుకగా ఇత్తురు వానిని తీసుకొనుము. తరువాత గిబియా, తేలోహిము వెళ్లి అక్కడ ఫిలిస్తీయుల శిబిరం ఉంది అక్కడకు చేరగానే ప్రవక్తల సమాజము ఉన్నత స్థలము దిగి వచ్చుచుండును, వారు ప్రవచనములు పలుకుతారు, వారితోపాటు నీవుకూడా ప్రవచించెదవు , దానితో నీవు పూర్తిగా మారిపోయెదవు, ఇవన్నీ జరిగిన తరువాత తగినవిధంగా పనులు చేయుము అని చెప్పాడు. ఇక నీవు ముందుగా వెళ్లి గిల్గాలు చేరుము నేను అక్కడకు వచ్చెదను. నీవు నాకోసం ఏడురోజులు వేచియుండుము నేను వచ్చి నీవు ఏమి చేయాలో చెప్పదను అని చెప్పాడు.
సౌలు సమూవేలును వీడివెళ్ళగానే ఆయన చెప్పినవన్నీ జరిగాయి. దేవుడు అతని హృదయమును పూర్తిగా మార్చివేసాడు. అతడు గిబియా చేరగానే ప్రవక్తల సమూహం ఎదురవగానే దేవుని ఆత్మ అతని మీదికి రాగా, సౌలు ప్రవచనములను పలికాడు. అది చూచిన ప్రజలు కీషు కుమారునికి ఏ గతి పట్టెనని పలికారు. తరువాత సౌలు ఇంటికి వెళ్ళాడు. సమూవేలు మిస్పా వద్ద యావే ఎదుటికి ప్రజలను రప్పించి వారితో యిస్రాయేలు దేవుడు మిమ్ములను ఐగుప్తు నుండి మరియ శత్రువుల బారి నుండి కాపాడుకుంటూ వచ్చాడు. మీరు మాకు రాజును నియమించాలని, దేవుణ్ణి పట్టుపట్టారు., మీ తెగల వారిగా యావే ముందు నిలవండి అని చెప్పాడు, సమూవేలు చీట్లు వేయగా బెన్యామీను తెగలోని మంత్రీ కుటుంబంలోని కీషు కుటుంబంలోని సౌలు వంతు వచ్చినప్పుడు అతను కనపడలేదు. అతడు సామానులు మధ్య దాగుకొని ఉన్నాడు అని ప్రభువు తెలియచేయగా అతనిని తీసుకొని వచ్చారు. అప్పుడు సమూవేలు ప్రజలతో దేవుడు ఎవరిని ఎన్నుకొన్నారో చూసారో కదా, ఇటువంటి వారు యిస్రాయేలులో ఎవరు లేరు అనెను అపుడు జనులు మా రాజు కలకాలము జీవించు గాక అని కేకలు వేశారు. అపుడు సమూవేలు రాజు ఎలా పాలించునో చెప్పారు, అలానే ఒక గ్రంథమును రాసి యావే ముందుట ఉంచాడు. తరువాత ప్రజలను వారివారి ఇళ్లకు పంపించాడు.
కొంతమంది యితడు మనలను ఎట్లు రక్షింపగలడు అని సౌలును తక్కువ చేసి మాట్లాడారు. సౌలు అమ్మోనీయులను ఓడించిన తరువాత ప్రజలు సమూవేలుతో సౌలును తక్కువ చేసి మాట్లాడిన వారిని తీసుకోని రమ్ము మేము వారిని వధిస్తాము అని చెప్పారు. సమూవేలు ప్రజలతో మనము గిల్గాలుకు పోవుదము, అక్కడ రాజనియామమునకు ఒప్పుకుందుము అని మాటయిత్తుము అని చెప్పి గిల్గాలు వెళ్లి అక్కడక సౌలును రాజుగా ప్రకటించాడు. సమూవేలు ప్రజలతో మీ మనవుల ప్రకారం మీకు రాజును నియమించాను, రాజే మిమ్ము ఇకనుండి నడిపిస్తాడు. నేను ముసలివాడిని అయ్యాను, చిన్ననాటి నుండి మీకు నాయకుడిగా నిడిపించాను. నాలో ఏమైనా దోషం ఉన్న యెడల యావే ఎదుట, రాజు ఎదుట నిరూపించమని అడిగాడు. నేను ఎవరిది ఏదైనా తీసుకున్నానా? లంచము తీసుకొని న్యాయము చెప్పానా? మోసం చేసానా? నేను ఏమైనా చేసినచో రుజువు చేయండి నేను వారికీ అది ఇస్తాను అని చెప్పాడు. దానికి ప్రజలు అటువంటిది ఏమి లేదు అని సమాధానం ఇచ్చారు.
నాలో ఏ అపరాధము లేదనుటకు యావే సాక్షి, ప్రభువుచే అభిషిక్తుడగు రాజు సాక్షి అని సమూవేలు చెప్పగానే ప్రజలు అవును ప్రభువే సాక్షి అని బదులిచ్చారు. తరువాత దేవుడు ఎలా వారిని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చినది, ఎలా వారికి భూమి ఇచ్చినది, వారు ఆయన మాట వినక ఇతర దేవతలను కొలిచినందుకు శిక్షించినది సమూవేలుతో ప్రజలు చెప్పారు. దేవుణ్ణి వారు ఎలా మొరపెట్టుకొన్నది శత్రువుల నుండి విడిపించమని చెప్పినది చెప్పి, దేవుడు న్యాయాధిపతులను పంపి వారి బానిసత్వము నుండి విడిపించగా వారు చీకు చింతలు లేక బ్రతికిన విషయం వెల్లడి చేసాడు. యావే మీ రాజు , అయినను మీరు మాకు యావే కాక మరియొక రాజు కావాలి అని అడిగారు. ఇతడే మీరు ఎన్నుకొనిన రాజు, మీరును మీ రాజును ప్రభువు పట్ల భయ భక్తులు చూపించి , ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించిన మీకు మేలు జరుగును లేదేని మీరు ముప్పు తిప్పలు పడునట్లు చేయును. ప్రజలను అక్కడే ఉంచి వారి ముందు ఒక గొప్ప కార్యము చేసాడు గోధుమ కాల సమయంలో యావెను ప్రార్ధించగా , సమూవేలు చెప్పినట్లుగా ఉరుములతో వాన కురిసింది. దీని ద్వారా ప్రభువును వారు రాజు కావలెనని అడిగి చేసిన తప్పును తెలుసుకోవాలని వారికి చెప్పాడు. వారు సమూ వేలుతో మా తరుపున యావేకు విన్నపము చేయుము , రాజును కోరుకొనుట కూడా మేము చేసిన తప్పిదమే అని పలికారు. అందుకు సమూ వేలు భయపడకుడు మీరు తప్పు చేసిన మాట వాస్తవమే కానీ ప్రభువును అనుసరించుట మాత్రం మానకుడు, ఆయనను పూర్ణ హృదయముతో సేవింపుడు, విగ్రహములు మాయే, అవి కాపాడలేవు, వాని వలన ప్రయోజనము లేదు. యావే తన ఘనమైన నామమును నిలబెట్టుకొనువాడు కనుక మిమ్ము పరిత్యజించడు. నేను మీకొరకు మనవి చేసెదను. మీకు ధర్మ మార్గమును చూపెదను అని వారికి బోధించాడు.
సాలు ఒక ఏడాది పాలన చేసిన తరువాత పిలిస్తియుల దండును హతము చేసినందుకు వారు ఇస్రాయేలీయుల మీద కోపముగా ఉన్నారు. యిస్రాయేలీయులు భయంతో ఉన్నారు. శత్రువులు వారి చుట్టూ చేరారని వారు పారిపోయారు. సౌలు గిల్గాలు వద్ద ఉన్నాడు. సౌలు సమూవేలు చెప్పిన గడువు ప్రకారము ఏడూ రోజులు ఆగి సామూవేలు రాలేదని, ప్రజలు వీడిపోతున్నారని దహన బలిని, సమాధాన బలిని సిద్ధం చేయించి తానె దహన బలిని అర్పించాడు. అపుడు సమూవేలు వచ్చి ఎంతపని చేసితివి అని అన్నాడు. నీవు ప్రభువు ఆజ్ఞ పాటించి ఉండినట్లైయితే ఎప్పటికి నీ కుటుంబము వారే రాజుగా ఉండేవారు అని చెప్పాడు. ప్రభువు ఇంకొకరిని నాయకునిగా ఎన్నుకొనును అని చెప్పి సమూవేలు గిల్గాలు నుండి వెళ్ళిపోయాడు.
సౌలు తన పాలనను సుస్థిరం చేసుకొని పాలించసాగాడు. కొన్నాళ్లకు సమూవేలు సౌలు వద్దకు వచ్చి నేను యావే పంపగా వచ్చి, నిన్ను యిస్రాయేలీయులకు రాజుగా అభిషేకించాను, ఇప్పుడు ప్రభువు మాటలు వినుము. యిస్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చునప్పుడు అమాలేకీయులు త్రోవలో వారినెదిరించి బాధించారు, వారిని నేను శిక్షించాలని ప్రభువు అంటున్నాడు. కనుక నీవు వెంటనే పోయి వారిని వధింపుము, వారిలో ఒక్కరిని కూడా బ్రతుకనీయవద్దు. ఎడ్లను, గొర్రెలను , ఒంటెలను, గాడిదలను, అన్నింటిని మట్టుపెట్టుము ఇది యావే ఆజ్ఞ అనిచెప్పాడు. సౌలు అమాలేకీయులను సంహారించాడు. ఆగాగును చంపలేదు.. క్రొవ్విన ఎడ్లను దూడలను గొర్రెలను గొర్రె పిల్లలను చంపలేదు. మంచి వాటిని మిగుల్చుకొని పనికిరాని వాటిని శాపము పాలుచేసి వదించారు. సమూవేలుకు ప్రభువు దివ్యవాణి సౌలును రాజును చేసినందుకు నేను విచారించుచున్నాను. అతను నా ఆజ్ఞలను పాటించక , దిక్కరించాడు అని సమూవేలుతో చెప్పాడు.
మరునాడు సమూవేలు సౌలును చూడబోయాడు. అప్పటికే సౌలు గిల్గాలుకు వెళ్ళాడు అని తెలియగ అక్కడకు వెళ్ళాడు. సమూవేలు సౌలును కలవగానే సౌలు సమూవేలుతో ప్రభువు నిన్ను దీవించునుగాక నేను యావే ఆజ్ఞను పాటించితిని అని చెప్పాడు. అందుకు సమూవేలు అది నిజమైతే గొర్రెల అరుపులు ఎద్దుల రంకెలు నా చెవులలో ఇంకా రింగున మారుమ్రోగుచున్నవి ఎందుకు అని అడిగాడు. అపుడు సౌలు వాటిని అమాలేకీయుల నుండి కొన్నాము అని చెప్పాడు. ప్రజలు శ్రేష్టమైన ఎడ్లను, గొర్రెలను యావేకు బలి ఇచ్చుటకు అంటిపెట్టుకొని మిగిలిన వాటిని శాపము పాలు చేసి సంహరించాము అని చెప్పాడు. అపుడు సౌలుతో సమూవేలు నీ మాటలు ఆపు, ప్రభువు నాతో చెప్పిన మాటలు వినుము, నీవు అల్పుడవైనను యావే నిన్ను యిస్రాయేలుకు నాయకునిగా చేయలేదా ? నిన్ను రాజుగా చేయలేదా? నీకు యావే ఒక పని అప్పగించి ఉన్నాడు. అది నీవు ఎలా దిక్కరించావు? దోపిడిసొమ్ము దక్కించుకోవడం కోసం యావే ముందు పాపం చేసావు అని అడిగాడు.
అందుకు సౌలు నేను యావే మాట ఆలకించాను, ఆగాగును తీసుకొచ్చాను, గిల్గాలు వద్ద యావేకు బలి అర్పించుటకు ప్రజలే వాటిని అట్టిపెట్టుకొన్నారని చెప్పాడు. అందుకు సమూవేలు యావే బలుల వలన సంతృప్తి చెందునా? విధేయత వలనగాదా? బలి కంటే విధేయత మేలు నీవు యావే మాట త్రోసివేసావు కనుక యావే నీ రాజరికమును త్రోసివేసెను. అని చెప్పాడు. అందుకు సౌలు ప్రజలకు భయపడి నేను అటుల చేసి పాపము కట్టుకున్నాను. నా తప్పు క్షమించి, యావెను మ్రొక్కుటకు నాతో రమ్మని అడిగాడు. దానికి సమూవేలు నేను నీ వెంట రాను, నీవు యావే పలుకులు తిరస్కరించితివి కనుక నీ రాజపదవిని యావే తిరస్కరించాడు అని చెప్పి, మారాలి వెళ్లపోతుండగా సౌలు అతని అంగీ చెంగు పట్టుకోగానే అది చినిగింది. సమూవేలు అతనితో ఈరోజు ప్రభువు యిస్రాయేలు రాజ్యమును నీ చేతినుండి లాగివేసి నీకంటే యోగ్యుడైన వానికి ఇచ్చివేసెను అని చెప్పాడు. మరల సౌలు సమూవేలుతో యావెను మొక్కుటకు నాతో రమ్ము అని అడుగగా సమూవేలు సౌలు వెంట వెళ్ళాడు. అతడు యావేకు మ్రొక్కాడు. సమూవేలు ఆగాగును తీసుకొని రమ్మని చెప్పగా వారు అటులె చేసెను. అప్పుడు సమూవేలు అతనితో నీకత్తి వలన తల్లులు బిడ్డలను కోల్పోయినట్లే నేడు నీ తల్లి తన బిడ్డను కోల్పోవును అని యావే ఎదుట అతనిని నరికివేసెను. తరువాత సమూవేలు రామాకు వెళ్ళిపోయాడు. సౌలు చనిపోవువరకు సమూవేలు అతనిని కలుసుకొనలేదు.
సౌలు గురించి సమూవేలు పరితపించాడు. యావే సమూవేలుతో నేను సౌలును తిరస్కరించినందుకు ఎంతకాలము దుఃఖించెదవు. కొమ్మును తైలమును నింపుకొని వేళ్ళు, బేత్లెహేము వాసియైన యిషాయి వద్దకు పంపుతున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా ఎన్నుకొంటిని అని చెప్పాడు. అందుకు సమూవేలు నేను పోలేను, ఈ మాట వింటే సౌలు నన్ను చంపివేస్తాడు అని అన్నాడు. అందుకు నీవొక ఆవు పెయ్యను తీసుకెళ్ళుము, ఆ ఊరివారితో యావేకు బలి అర్పించడానికి వచ్చాను అని చెప్పుము. యిషాయిని కూడా బలి అర్పణమునకు పిలువుము. అక్కడ నీవేమి చెయ్యాలో అక్కడ చెప్పెదను నీవు మాత్రము నేను నిర్ణయించిన వానిని అభిషేకించాలి అని చెప్పాడు.
సమూవేలు యావే చెప్పినట్లు బేత్లెహేము వెళ్ళాడు. ఆ ఊరి పెద్దలు అతనిని చూచి భయపడ్డారు. వారు మీరు మా మేలు ఎంచి వచ్చారా లేక కీడు ఎంచి వచ్చారా అని అడుగగా మీ మేలు కోరే వచ్చాను, ఇక్కడ బలి అర్పించడానికి వచ్చాను, మీరు శుద్ధి చేసుకొని రావాలి అని చెప్పాడు. యిషాయిని అతని కుమారులను సమూవేలు శుద్ధి చేసి బలికి ఆహ్వానించాడు. వారు అప్పుడు బలికి వచ్చారు. అపుడు సమూవేలు యిషాయి పెద్ద కుమారుని చూసి ప్రభువు అతనిని ఎన్నుకొనబోతున్నాడు అని అనుకున్నాడు. యావే సమూవేలుతో రూపమును, ఎత్తును చూసి భ్రమపడకుము, దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు, హ్రదయమును అవలోకించును అని చెప్పాడు. అదే విధంగా యిషాయి కుమారులు ఏడుగురు సమూవేలు ఎదుట నిలిచారు కానీ యావే వారిని ఎన్నుకొనలేదు. అప్పుడు సమూవేలు నీ కుమారులు వీరేనా ? అని అడిగారు. అపుడు అతను చిన్నవాడు పొలమున గొర్రెలు కాయుచున్నాడు అని చెప్పాడు. ఎవరిని అయినా పంపి అతనిని పిలిపింపుము, అతను వచ్చినంత వరకు నేను భోజనమునకు కూర్చొను అని చెప్పాడు. దావీదు రాగానే యావే నేను కోరుకొనినవాడు ఇతనే అని చెప్పాడు. సమూవేలు తైలపు కొమ్ము తీసుకొని అన్నలేదుట అతనికి అభిషేకము చేసాడు. అప్పటి నుండి యావే ఆత్మ దావీదును ఆవహించి అతనిలో ఉండిపోయింది. దాని తరువాత సమూవేలు రామాకు వెళ్ళిపోయాడు.
దావీదును చంపుటకు సౌలు ప్రయత్నిస్తుండగా దావీదు రామా వద్ద ఉన్న సమూవేలు వద్దకు వచ్చి జరిగిన విషయాలు మొత్తము చెప్పాడు. అపుడు దావీదు, సమూవేలు నావోతు చేరి అక్కడ ఉన్నారు. సౌలు అది తెలుసుకొని సేవకులను దావీదును పట్టుకొనుటకు పంపాడు. వారు వచ్చి సమూవేలు ప్రవక్తల సమూహమునకు నాయకునిగా నిలుచుట చూడగా దేవుని ఆత్మ సౌలు సేవకుల మీదకు రాగ వారుకూడా ప్రవచనములు పలికారు. ఇది విని సౌలు మరల కొంతమంది సేవకులను పంపారు. వారును అలానే చేశారు. అపుడు మూడవసారి కూడా వారు అంతే చేశారు. అపుడు సౌలు స్వయంగా రామాకు వచ్చి అక్కడివారిని సమూవేలును దావీదును చూసారా అని అడుగగా వారు నావోతు వద్ద ఉన్నారు అని చెప్పగా సౌలు అక్కడకు పోవుటకు బయలుదేరగా దేవుని ఆత్మ అతన్ని ఆవేశించినది. అపుడు అతడు ఆవేశముతో బట్టలను తొలగించుకొని సమూవేలు ఎదుటనే ప్రవచనలు చెప్పాడు. కాని దావీదు అపుడు యోనాతాను వద్దకు వెళ్ళిపోయాడు. తరువాత కొన్నాళ్ళకు సమూవేలుమరణించాడు. యిస్రాయేలీయులందరు సమావేశమై అతని కొరకు శోకించారు. రామాలో అతని ఇంటిలో అతనిని పాతిపెట్టారు.
సమూవేలు చనిపోయిన తరువాత సౌలు పిలిస్తియుల మీద యుద్ధమునకు పోవుటకు యిస్రాయేలును సిద్ధముచేసాడు కానీ వారిని చూసి భయపడ్డాడు. అతడు యావెను సంప్రదించిన కాని యావే స్వప్నంలోకాని ఊరీము వలన కానీ ప్రవక్తల ద్వారా కానీ ఏమి సెలవియ్యలేదు. అపుడు చనిపోయిన వారిని ఆవాహకము చేసుకొనే ఒక మాంత్రికురాలను సమీపించి మృతలోకం నుండి నేను సమూవేలుని రప్పింపుము అని అడిగాడు. ఆమె సమువేలు లేచి వచ్చుట చూసి భయపడి కేకవేసింది. ఆమెతో సౌలు అతడు నీకు ఎవరు కనపడిరి అని అడుగగా భూమిలో నుండి దైవములలో ఒకడు లేచి వచ్చుచున్నాడు అని చెప్పింది. సౌలు అతని ఆకారము గురించి అడుగగా దుప్పటి కప్పుకొనిన ముసలివడెవడో లేచి వస్తున్నాడు అని చెప్పాడు. అపుడు వెంటనే సమూవేలు అని గ్రహించి సౌలు లేచి నేలపై సాగిలపడి దండము పెట్టాడు. సమూవేలు సౌలుతో నీవు నన్ను కుదురుగా ఉండనియక ఎందుకు రప్పించితివి అని అడిగాడు. అపుడు సౌలు ఫిలిస్తీయులు నాపై యుద్ధమునకు వచ్చారు, నేనేమి చెయ్యాలో తెలియడం లేదు. ప్రభువు నాతో మాట్లాడలేదు. దిక్కుతోచక నిన్ను రప్పించితిని అని చెప్పాడు. అపుడు సమూవేలు యావే నిన్ను విడనాడి, నీకు శత్రువు కాగ, నన్ను సంప్రదించి ప్రయోజనమేమి? యావే చెప్పినట్లే చేసాడు. ప్రభువు రాజ్యమును నీ నుండి తొలగించి నీ పొరుగువాడైన దావీదునకు ఇచ్చివేసెను. నీవు ప్రభువు మాట పాటింపవైతివి. కనుకనే యావే నిన్ను వీడెను, ప్రభువు నిన్నును, నీ తనయులును ఫిలిస్తీయుల చేతికి అప్పగించును రేపు నీవు నీ కుమారులు నాతో ఉందురు అని చెప్పాడు.